హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్, భూమి ఖాళీ చేయాలని స్థానికులను బెదిరించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలంలోనుంచి బయటకు పంపి, గేటుకు తాళాలు వేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం పోలీసులు ఘటనాస్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే కాల్పులు జరిగిన గన్‌ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
