బాపట్ల–చీరాలలో వందే భారత్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌


వందే భారత్‌ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించే విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల న్యూఢిల్లీకి వెళ్లిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి, వందే భారత్‌కు రెండు స్టేషన్లలో స్టాపింగ్‌ ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీ కృష్ణప్రసాద్‌ ఇప్పటివరకు రెండు సార్లు రైల్వే మంత్రిని కలసి ఇదే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించి, రెండు స్టేషన్లలో రైలును నిలిపే సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నివేదిక రాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం రోజూ రెండు వందే భారత్‌ రైళ్లు — సికింద్రాబాద్‌–తిరుపతి, విజయవాడ–చెన్నై — బాపట్ల, చీరాల మీదుగా వెళ్తున్నప్పటికీ ఆగడం లేదు. వీటి ద్వారా ప్రయాణిస్తే చెన్నైకి కేవలం 5 గంటలు, హైదరాబాద్‌కు 4.30 గంటలు, తిరుపతికి 3.30 గంటల్లో చేరుకోవచ్చు. వేగం, సౌకర్యం కారణంగా వందే భారత్‌ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. అయినప్పటికీ బాపట్ల జిల్లాలో ఎక్కడా వీటికి హాల్టింగ్‌ లేకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

బాపట్లలోక్‌సభ నియోజకవర్గ కేంద్రం కావడంతో పాటు, జాతీయ స్థాయి విద్యా–పరిశోధనా సంస్థలు ఉండటం వల్ల ఈ పట్టణానికి ప్రాధాన్యత ఎక్కువ. బాపట్ల రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో ఎంపిక చేసి ఆధునికీకరిస్తున్నారు. అలాగే, చీరాల ప్రముఖ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది. అందువల్ల రెండు పట్టణాల ప్రజలు వందే భారత్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వందే భారత్‌ రైళ్లు ఆగుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనపు బోగీలు జత చేసి అయినా, బాపట్ల–చీరాలలో హాల్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈ రెండు స్టేషన్లు కేవలం 18 కి.మీ దూరంలో ఉండటం వల్ల సాంకేతిక పరమైన అవరోధాలు ఉన్నాయని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ స్థానిక ప్రజలు మరియు రాజకీయ ప్రతినిధుల ఆశలు సానుకూల నిర్ణయంపైనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *