తాజాగా కురిసిన వర్షాల కారణంగా రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇలాంటి దుష్ప్రచారంలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ (FAC) ఎస్. సుభాష్ చంద్రబోస్ ఫేస్‌బుక్‌లో అమరావతి పై వివాదాస్పద పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
వాస్తవ పరిస్థితి ఏమిటి?
- కొండవీటి వాగు ప్రవాహం:
భారీ వర్షాల వల్ల కొండవీటివాగు ఉప్పొంగి, అమరావతి పక్కనుండి కృష్ణా నదిలో కలిసింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనుల కారణంగా వాగు ప్రవాహానికి కొన్ని చోట్ల అడ్డంకులు ఉండటంతో, పెదపరిమి – నీరుకొండ మధ్య పొలాల్లో నీరు నిలిచింది. - పాత సమస్య, కొత్తది కాదు:
తాడికొండ మండలంలో వర్షాకాలంలో వాగు నీరు పొలాలు ముంచడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న సహజ పరిస్థితి. సాధారణంగా నాలుగు–ఐదు రోజుల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుంది. - ప్రకాశం బ్యారేజ్ వద్ద లిఫ్ట్:
ఇలాంటి పరిస్థితులు నివారించేందుకే 2019కి ముందే ప్రకాశం బ్యారేజ్ వద్ద లిఫ్ట్ నిర్మించారు. - అమరావతి భూసమీకరణలో లేని భూములు:
ప్రస్తుతం నీటమునిగిన పొలాలు అమరావతి భూసమీకరణలోకి రానివి. - ఐకానిక్ టవర్స్ పునాదులు:
నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్స్‌లోని 1–2 పునాదుల్లో కొంత వర్షపు నీరు చేరింది, అది కూడా రక్షణ గోడలు లేకపోవడమే కారణం. దీనిని చూపిస్తూ ‘అమరావతి మునిగిపోయింది’ అనే దుష్ప్రచారం జరుగుతోంది.
తప్పుదోవ పట్టించే ప్రచారం
- వాస్తవానికి అమరావతిలో ఎక్కడా మునిగిపోవడం జరగలేదు.
- రోడ్డుపక్క గోతుల్లో చేరిన నీరు, పొలాల్లో నిలిచిన వర్షపు నీరు మాత్రమే చిత్రాలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
- అమరావతి మునగలేదని తెలిసినా రాజకీయ స్వార్థంతో కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం
ప్రజలు తప్పుదారి పట్టేలా సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టడం ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అని అధికారులు స్పష్టం చేశారు.