ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు కర్నూలు–గుంటూరు రహదారి అత్యంత కీలకమైనదిగా ఉంది. ఈ రహదారే రాజధాని ప్రాంతానికి, శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుకునే ప్రధాన మార్గం. అయితే ఈ రహదారి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుండటంతో ప్రయాణం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది.
ఇటీవల కురుస్తున్న వరుస వర్షాల ప్రభావంతో నల్లమలలో పరిస్థితి మరింత విషమించింది. వరద నీరు రహదారిపై ప్రవహించడం, భారీ చెట్లు తరచూ కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత కీలకమైన రహదారి విస్తరణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. రద్దీ తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు ప్రమాదాలకు “దారి” తీస్తోందని స్థానికులు వాపోతున్నారు.
బైర్లూటి దాటాక నల్లమల ప్రాంతంలో మొబైల్ సిగ్నళ్లు అందవు. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాహ్య ప్రపంచానికి సమాచారం చేరడం కష్టసాధ్యం. పోలీసులు హైవే పెట్రోలింగ్ వాహనం నడుపుతున్నప్పటికీ, అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ ఉంటుందో స్పష్టంగా తెలియదు. ప్రమాదాలు జరిగిన సమయంలో ట్రాఫిక్ స్తంభించిపోతే వాహనదారులు అతి కష్టాల్లో పడుతున్నారు.
సాధారణ సమాచారం కూడా ఇస్తే అది బైర్లూటి చెక్‌పోస్టు లేదా దోర్నాల వైపు కొర్రపోలు చెక్‌పోస్టు, మధ్యలో రోళ్లపెంట వద్ద మాత్రమే అందుతుంది. ఆ దాకా వాహనదారులు నరకయాతన అనుభవించక తప్పదు. ఇటీవల ఆదివారం అర్ధరాత్రి కొర్రపోలు చెక్‌పోస్టు సమీపంలోని పెద్ద మంతనాల వద్ద భారీ చెట్టు రహదారిపై పడిపోవడంతో మూడు గంటల పాటు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షంలో గంటల తరబడి ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారు.
స్థానికులు చెబుతున్నట్లు – నల్లమల ఘాట్ రహదారి అత్యంత కీలకమైన మార్గం. ఈ రహదారిపై ఆధారపడి వేలాదిమంది ప్రయాణిస్తారు. కానీ రహదారి విస్తరణ, బలపరచడం, భద్రతా చర్యలపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం వల్ల ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ – రహదారి విస్తరణ, మౌలిక సదుపాయాలు, క్రమమైన పహారా వాహనాలు, అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో రక్షణ గోడలు, బలమైన డ్రైనేజ్ వ్యవస్థ, అత్యవసర కమ్యూనికేషన్ సదుపాయం కల్పించాలని విన్నవిస్తున్నారు.
మొత్తానికి నల్లమల ఘాట్ రహదారి ప్రస్తుతం ప్రజల ప్రాణాలను పరీక్షిస్తున్న మార్గంగా మారింది. వర్షాకాలం కొనసాగుతున్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కర్నూలు వాసులు గళమెత్తుతున్నారు.