దంపతుల కలహాలకు అండగా వన్‌స్టాప్‌ సఖి – కాపురాలను కాపాడే కౌన్సిలింగ్‌ కేంద్రం


నేటి కాలంలో చిన్నచిన్న విషయాలకే పంతాలు, పట్టింపులు పెట్టుకోవడం, కుటుంబ వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం వలన అనేక దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా జంటలు పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి మానసిక బలం, అవగాహన కల్పించి, కుటుంబ జీవితం సాఫీగా సాగేందుకు భీమవరం కలెక్టరేట్‌ సమీపంలోని విస్సాకోడేరులో ఏర్పాటు చేసిన ‘వన్‌స్టాప్‌ సఖి’ సెంటర్ కృషి చేస్తోంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రం అనేక దంపతుల జీవితాల్లో మార్పు తీసుకువస్తోంది.

ఒక సందర్భంలో ఓ యువకుడు తన భార్యను చుట్టుపక్కల వారు తక్కువ చేసి మాట్లాడతారని భావించి ఇంటికే పరిమితం చేశాడు. రెండు సంవత్సరాలు ఆమె బంధువులను కలవనీయక, బయటకు పంపకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యింది. చివరకు సఖి సెంటర్‌ ఆశ్రయించగా, మూడు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా దంపతుల మధ్య అపార్థాలను తొలగించి కాపురాన్ని నిలబెట్టారు.

ఇక పెళ్లి కాని జంటలకూ ఈ కేంద్రం సహాయం చేస్తోంది. వివాహ బంధం, కుటుంబ వ్యవస్థపై ముందుగానే అవగాహన కల్పించి భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరంగా చెప్పుతున్నారు. మహిళా న్యాయవాదులు, కౌన్సెలింగ్‌ అధికారిణులు ఆర్థిక నిర్వహణ, ఖర్చుల నియంత్రణ, అనుభూతుల పంచుకోవడం వంటి అంశాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు.

మరో ఘటనలో, డిగ్రీ చదివిన యువతి, 10వ తరగతి చదివిన యువకుడిని పెద్దలు వివాహం చేశారు. మొదట కాపురం సజావుగా సాగినా, చదువులో తేడా కారణంగా, అత్తతో విభేదాలు పెరిగి, దంపతులు రెండేళ్ల పాటు వేర్వేరుగా జీవించారు. వారిని సఖి సెంటర్‌లో రెండు సార్లు కౌన్సిలింగ్‌ చేయగా, విభేదాలు సర్దుకుని ప్రస్తుతం ఆనందంగా కాపురం సాగిస్తున్నారు.

ఇప్పటివరకు సఖి సెంటర్‌లో 234 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 118 దంపతులు కౌన్సెలింగ్‌ తీసుకోగా, 116 సమస్యలు పరిష్కారమయ్యాయి. అదనంగా పలువురికి న్యాయసహాయం, వైద్య సహాయం, కొంతమందికి తాత్కాలిక వసతి కూడా కల్పించారు.

ఈ సేవలు కేవలం భీమవరం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, దంపతుల కలహాలను తగ్గించేందుకు, కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *