పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పౌరులపై దాడికి భారతదేశం గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో బహిరంగ సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు చేపట్టిన ప్రతీకార చర్య ప్రపంచానికి భారత్ శక్తిని చూపిందని ఆయన తెలిపారు.
“నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను చెప్పాను. ఆ మహాదేవుడి ఆశీర్వాదంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాను. ఇది ఉగ్రవాదంపై భారత్ చూపించిన రుద్ర రూపం. పాకిస్తాన్ మట్టిలోకి దాకా దాక్కున్నా వదిలే ప్రసక్తి లేదు,” అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవుడికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ – “శివుడు మంగళకరమైనవాడు కానీ ఉగ్రవాదంపై రుద్ర రూపం ధరిస్తాడు. భారతదేశం ఇప్పుడు అదే రుద్ర రూపంతో స్పందించగలుగుతున్న దేశంగా మారింది” అని స్పష్టం చేశారు.
భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు, డ్రోన్లు, గగన రక్షణ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచం ఈ ఆపరేషన్ ద్వారా తెలుసుకుందన్నారు. బ్రహ్మోస్ క్షిపణి శక్తి వలన పాక్ ప్రజలు భయంతో నిద్రపట్టక పోతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ వారణాసిలో రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ భద్రత, సాంకేతికాభివృద్ధి, స్వదేశీ ఆయుధ వ్యవస్థలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లో జాతీయత భావనను నింపుతున్నాయి.