వెండితెర వెలుగుల నుండి మౌన జీవితం
తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాబూ మోహన్ తాజాగా తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, గతాన్ని తలచుకుంటూ ‘బిగ్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో రవీంద్రభారతి బయట నిలబడి నాటకాలు చూడాలని కలలుగన్న వ్యక్తి, ఆ రవీంద్రభారతిలో ఎన్నోసార్లు సన్మానించబడటం తన జీవితంలో గొప్ప ఘట్టమని చెప్పారు.
స్టార్ హీరోల అభిమానానికి బాబూ మోహన్ గుర్తింపు
తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి టాప్ హీరోలందరితో కలిసి నటించానని, వారు తనను ఎంతో గౌరవంతో చూసేవారని అన్నారు. తనతో నటించిన ప్రతి నటుడి నుంచి అహంకారాన్ని చూడలేదని, ఇప్పటికీ ఎవరికైనా తారసపడితే వారు ఎంతో ఆప్యాయతతో పలకరిస్తారని చెప్పారు. కోట శ్రీనివాసరావుతో కలిసి నటించిన అనుభవాలు ప్రత్యేకమైనవని, వాళ్ల జోడీకి వచ్చిన గుర్తింపు తమ అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.
జీవితం నేర్పిన చేదు అనుభవాలు
తన జీవితంలో జరిగిన దురదృష్టకర సంఘటనల గురించి చెబుతూ బాబూ మోహన్ ఉద్వేగానికి లోనయ్యారు. పెద్ద కుమారుడిని ప్రమాదంలో కోల్పోయిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, “దేవుడిని నిలదీసాను, ఎందుకిలా చేశావని… ఆ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేదు, ఎందుకంటే దానికంటే పెద్ద కష్టం ఏదైనా ఉంటుందా?” అంటూ చెప్పారు. ఈ మాటలే ఆయన నొప్పి ఎంత లోతుగా ఉందో చెప్పడానికి నిదర్శనం.
తాను ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు
తన జీవితంలో ఎవరి మనసును గాయపరచలేదని బాబూ మోహన్ చెప్పుకొచ్చారు. అందుకే ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే తనను ప్రోత్సహించిన దర్శకులకు మాత్రం జీవితాంతం కృతజ్ఞతలతో ఉంటానని చెప్పారు. ఈ మాటల ద్వారా ఆయన లోనిది ఎంతో వినమ్రతతో కూడిన వ్యక్తిత్వమని స్పష్టమవుతోంది.