టెల్ అవీవ్ లోని ప్రముఖ బెన్ గురియన్ విమానాశ్రయంపై యెమెన్‌లోని హౌతీల నుండి ప్రయోగించిన క్షిపణి దిగువపడటంతో తీవ్ర కలకలం రేగింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) దీనిని అడ్డగట్టేందుకు యత్నించినప్పటికీ, శకలాలు విమానాశ్రయ పరిసరాల్లో పడ్డాయని ప్రకటించాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాల్లో భారీగా పొగలు, దెబ్బతిన్న రన్‌వే కనిపించాయి.
ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హౌతీలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “మేము గతంలో చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం, భవిష్యత్తులోనూ మరింత తీవ్రంగా ప్రతీకారం చూపుతాం” అని స్పష్టం చేశారు. అమెరికాతో సమన్వయంతో ఈ చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
క్షిపణి ప్రభావంతో రన్‌వే పై దాదాపు 25 మీటర్ల మేర గుంత ఏర్పడింది. ప్రయాణికులు భయాందోళనలకు గురవ్వగా, అరగంటలోనే విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే, ఈ దాడి భద్రతా ఆందోళనలను కలిగించిన నేపథ్యంలో పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపేశాయి.
ఎయిర్ ఇండియా, డెల్టా, లుఫ్తాన్సా వంటి విమానయాన సంస్థలు టెల్ అవీవ్‌కు తమ విమానాలు రద్దు చేశాయి. ఇజ్రాయెల్ అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఇలాంటి ముప్పులు ఎదురైనప్పుడు గట్టిగా స్పందిస్తామని నెతన్యాహు చెప్పడం గమనార్హం.