శనివారం ఉదయం గౌనిచెరువు సమీప అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహం కనిపించింది. స్థానికులు ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు.
అధికారులు ప్రాథమికంగా మృతి కారణాన్ని గమనించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు సహజ రీతిలో చనిపోయిందా? లేక ఎటువంటి ప్రమాదం వల్ల మృతి చెందిందా అనే విషయంపై విచారణ చేపట్టారు. మృతదేహం దగ్గర ఎలాంటి గాయాల ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలన సాగుతోంది.
ఈ గౌనిచెరువులో రెండు రోజుల క్రితం రెండు ఏనుగులు నీటిలో ఆడుకుంటూ కనిపించిన దృశ్యాలు స్థానికులు తమ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం మృతిచెందిన ఏనుగు అదే వృద్ధ ఏనుగా? లేక మరో ఏనుగా? అనే విషయం ఇంకా స్పష్టంగా తేలలేదు.
అటవీశాఖ అధికారులు ఏనుగుకు పోస్ట్‌మార్టం నిర్వహించి పూర్తి నివేదిక తర్వాతే స్పష్టత వస్తుందని తెలిపారు. స్థానికులు ఈ దుర్ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల రక్షణపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.