ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, టెలివిజన్, మ్యూజిక్, డిజిటల్ మీడియా రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ వినోద పరిశ్రమ భవిష్యత్తు దిశగా ఇది కీలక ఘట్టంగా నిలవనుందని ప్రధాని తెలిపారు.
ఈ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారత్ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని, కలల దృష్టితో ప్రపంచానికి వినోదాన్ని అందించగల శక్తి మన పరిశ్రమలో ఉందని ప్రశంసించారు. యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని వెల్లడించారు. గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్‌ను అభివృద్ధి చేయడమే ఈ సమ్మిట్ ఉద్దేశమని చెప్పారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, మిథున్ చక్రవర్తి, హేమమాలిని, మోహన్‌లాల్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరై సందడి చేశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షం ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. చిరంజీవి బుధవారం నుంచే ముంబయిలో ఉండటం విశేషం.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ నాలుగు రోజుల పాటు జరుగనుంది. సినిమాలు, సిరీస్‌లు, మ్యూజిక్, డిజిటల్ మీడియా రంగాల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు ఈ సమ్మిట్‌లో చర్చకు వస్తాయి. భారత్‌ను ప్రపంచ వినోద రంగంలో శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో WAVES ప్రారంభమైంది.