పహల్గామ్ దాడి తర్వాత భారత్ వైపు నుంచి ప్రతీకార చర్యలు తప్పవని అంచనా వేస్తున్న పాకిస్థాన్ గజగజ వణికిపోతోంది. భారత ఆర్మీ కదలికలను ముందుగా గుర్తించేందుకు ఎల్వోసీ వెంబడి పలు రహస్య చర్యలు చేపట్టింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, భారత్ వైమానిక దాడులు చేస్తుందన్న భయంతో పాక్ తన రాడార్ వ్యవస్థలను ముందంజలో తేవడానికి ప్రయత్నిస్తోంది.
సియోల్ కోట్ సెక్టార్లో పలు ప్రాంతాలకు రాడార్ వ్యవస్థలను తరలిస్తుండగా, ఫిరోజ్పూర్ సెక్టార్ ఎదురుగా భారత్ కదలికలను పసిగట్టేందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లను మోహరించింది. ఇది పాక్ ఆర్మీ భారత వైపు నుంచి వచ్చే ఏదైనా వాయుసేన చర్యలను ముందే గుర్తించేందుకు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోర్ కంటోన్మెంట్ సైట్లో అత్యాధునిక టీపీఎస్-77 రాడార్ను పాక్ మోహరించింది. ఈ మల్టీ రోల్ రాడార్ వ్యవస్థ విమానాల కదలికలను పర్యవేక్షించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది. ఇది భవిష్యత్తులో జరిగే చర్యలకు ముందు హెచ్చరికలుగా పని చేయగలదు.
దీనితోపాటు, పాక్ వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ ప్రాంతాల్లో భారత్ ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకపోయినా, పాక్ వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయి. అయితే భారత సైన్యం అవి అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా, అవసరమైతే తగిన బదులివ్వడానికి సిద్ధంగా ఉంది.