పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన హషీమ్ మూసా అనే ఉగ్రవాది పాక్ పారా కమాండోగా పనిచేశాడని సైనిక వర్గాలు వెల్లడించాయి. అతడు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో కలిసి పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందింది.
మూసాతో పాటు అరెస్ట్ చేసిన 15 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా అతడి సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారు. ఆయనకు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ శిక్షణ ఇచ్చిందని, కోవర్ట్ ఆపరేషన్లకు సిద్ధం చేసినట్లు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. ఇది పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న నేర సంబంధానికి స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు.
దాడిలో హషీమ్ మూసాతో పాటు పాల్గొన్న జునైద్ భట్, అర్బాజ్ మిర్‌లు కూడా పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్లు నిర్ధారణ అయ్యింది. వీరు ఆపరేషన్‌కు ముందు పాక్‌లో అత్యాధునిక ఆయుధ శిక్షణ పొందినట్లు అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా మార్గదర్శనంలో ఈ దాడి సాగిందని వారు పేర్కొన్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఉగ్రవాదులను ఆదుకుంటున్న పాక్ చర్యలను అంతర్జాతీయంగా ఎత్తిచూపేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాక్‌తో ఉగ్ర సంబంధాలపై ఆధారాలతో సహా సమాచారం సేకరించి ఐక్యరాజ్య సమితిలో వినిపించనుంది.