ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్‌లో నటించిన రోహిత్ బాస్ఫోర్ విషాదాంతం చావుతో వార్తల్లో నిలిచాడు. గువాహటిలోని గర్భంగా జలపాతంలో పడి మృతిచెందాడు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పిక్నిక్కు వెళ్లిన రోహిత్ అక్కడ ప్రమాదవశాత్తు నీటిలోకి పడి గల్లంతయ్యాడని తెలుస్తోంది.
రోహిత్‌తో పాటు ఉన్న 9 మంది స్నేహితులు అతడు జలపాతంలో పడ్డారని తెలిపినా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది సాధారణ మృతి కాదని అనుమానిస్తున్నారు. రోహిత్‌కు ఈత రాదని, మధ్యాహ్నం 12 గంటల వరకు అతడి ఫోన్ ఆఫ్‌లో ఉండటం శంకను కలిగిస్తోందని వారు చెప్పారు. అంతేగాక, ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లినందున ఇది కావాలనే జరిగిందేమోనని భావిస్తున్నారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం, సాయంత్రం 4 గంటల సమయంలో సమాచారం అందగా, 4.30కి ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిపారు. తరువాత సుమారు 6.30 గంటల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం రోహిత్ మృతదేహాన్ని వెలికి తీయగలిగింది. పోలీసులు ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని ప్రాథమికంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కేసు గురించి పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, రోహిత్ అకాలమరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని కలిగించింది. అభిమానులు, సహనటులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.