జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న బసంత్‌గఢ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందిన నేపథ్యంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో ముష్కరులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.
ఎదురుగా కాల్పులు జరగడంతో భద్రతా బలగాలు స్పందించాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా భద్రతా వర్గాలు ధృవీకరించాయి. తీవ్రంగా గాయపడిన మరికొంతమంది జవాన్లకు వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
సమీపంలోని బేస్ క్యాంపుల నుంచి స్పాట్‌కి అదనపు బలగాలను తరలిస్తున్నారు. ముష్కరుల సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. స్థానిక ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ సహకారంతో ఆర్మీ చురుకుగా పనిచేస్తోంది.
ఇక తాజా ఉగ్ర దాడుల నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జమ్మూ కాశ్మీర్ అధికారులు పూర్తి నివేదిక సమర్పించారు. ఆర్మీ, పారా మిలటరీ బలగాలను పర్యాటక హాట్‌స్పాట్లలో శాశ్వతంగా మోహరించే ప్రణాళిక రూపొందిస్తున్నారు.