ఐపీఎల్ తాజా సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ఊహించని వివాదానికి దారి తీసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను ఆర్ఆర్ కోల్పోవడం క్రికెట్ ప్రేమికుల్లో అనుమానాలకు దారితీసింది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఆరోపణలకు తావిచ్చింది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ చేసిన సంచలన వ్యాఖ్యలే. ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఆయన వేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తీవ్రమైన నిరసన తెలిపింది.
జయదీప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, జట్టును కలుషితం చేసే కుట్రపూరితమైనవని ఆర్ఆర్ యాజమాన్యం పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం సిద్ధేశ్ గెహ్లాట్, క్రీడా మంత్రి, కార్యదర్శికి అధికారిక ఫిర్యాదు చేశారు. ఇది జట్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని తీవ్రంగా ఖండించారు.
రాజస్థాన్ రాయల్స్ సీనియర్ అధికారి దీప్ రాయ్ మాట్లాడుతూ, “ఇది క్రికెట్ గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్య. బిహానీ ఆరోపణలు అవాస్తవం. ఈ వ్యాఖ్యలు రాజస్థాన్ రాయల్స్‌తో పాటు బీసీసీఐ, స్పోర్ట్స్ కౌన్సిల్, మల్టీ స్పోర్ట్స్ కంపెనీ ప్రతిష్ఠలకు మచ్చతెస్తాయి” అని చెప్పారు. ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.