తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమైన నటీమణి ప్రణీత ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రణీత, ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించారు.
ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, సిద్ధరామయ్య గారిని కలిసిన ఫొటోను పంచుకుంటూ, “మా అబ్బాయి నామకరణ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కలవడం, ఆహ్వానించడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత, ఈ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఆమె మరింత ప్రసిద్ధి పొందారు.
కొంతకాలం క్రితం వివాహం చేసుకున్న ప్రణీత, ఇప్పుడు సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబం సంబంధిత బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఆమెకు ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా, ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత, తరచూ తన వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.