పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన తరువాత, ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఒక కీలకమైన విషయం వెల్లడైంది. ఆయన చివరి కోరిక ప్రకారం, తన భౌతికకాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని కోరుకున్నారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సంప్రదాయానికి భిన్నంగా ఉంది. ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా, సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధం ఉండవచ్చని భావిస్తున్నారు.
సాధారణంగా, పోప్‌లను వారి మరణానంతరం వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేయడం ఆచారం. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించకూడదని నిర్ణయించారు. 2023 డిసెంబర్ 12న పోప్ ఫ్రాన్సిస్, మెక్సికన్ టెలివిజన్ చానల్ ‘ఎన్+’తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం ఆయన మరణానంతరం ఏర్పడనున్న అంత్యక్రియలను సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో గాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. ముఖ్యంగా, ఆ చర్చిలో ఉన్న ‘సేలస్ పోపులి రోమని’ అనే చిత్రాన్ని ఆయన ఆరాధిస్తారు. ఈ చిత్రాన్ని ఆయన విదేశీ పర్యటనల ముందు, తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక అనుబంధమే ఆయన చివరి కోరికగా బాసిలికా ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది.
చారిత్రకంగా, పోప్‌లను వాటికన్ వెలుపల ఖననం చేయడం చాలా అరుదు. 1903లో మరణించిన పోప్ లియో-13 మరణానంతరం తన కోరిక మేరకు రోమ్‌లోని సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేయబడ్డారు. అలాగే, సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఇప్పటివరకు ఆరుగురు పోప్‌ల అంత్యక్రియలు జరిగాయి. 1669లో చివరిసారి పోప్ క్లెమెంట్-9 ను అక్కడ ఖననం చేశారు.
