ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించేందుకు ‘మొహల్లా ఎలక్ట్రిక్ బస్ సర్వీస్’ను ప్రారంభించబోతోంది. అధికారికంగా ‘ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్‌చేంజెస్ (DEVI)’గా పిలవబడే ఈ పథకం, ఏప్రిల్ 22, 2025న ప్రారంభం కానుంది. మెట్రో స్టేషన్ల నుంచి నివాస ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. దీని ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన, శుద్ధమైన రవాణా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొస్తోంది.
తొలి దశలో 255 చిన్న ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డుపైకి తీసుకురానున్నారు. ఇవి 9 మీటర్ల పొడవులో ఉండి, రద్దీ వీధుల్లోనూ సులభంగా ప్రయాణించగలుగుతాయి. ప్రతి బస్సులో 23 సీట్లు ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించగలవు. బస్సుల్లో శుద్ధి, సౌలభ్యం, వాయు కాలుష్యానికి పరిష్కారంగా ఈ సేవలు నిలవనున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.25 మధ్యగా ఉంటాయి. మహిళల కోసం 6 ప్రత్యేక సీట్లు కేటాయించబడ్డాయి. అంతేకాకుండా, ‘పింక్ పాస్’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని ఢిల్లీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇది మహిళా ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నది.
మొదటి బస్సు మార్గం (MS-1) అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ నుంచి మయూర్ విహార్ ఫేజ్-3 వరకు, త్రిలోక్‌పురి, కళ్యాణ్‌పురి మీదుగా నడుస్తుంది. 2025 చివరి నాటికి 2,000కిపైగా ఎలక్ట్రిక్ బస్సులను సేవలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ హితత, ఇంధన పొదుపు, కాలుష్యం తగ్గింపునకు ఈ పథకం కీలకంగా నిలవనుంది.