దేవరాపల్లి మండలంలోని వాకపల్లి పంచాయతీలో గురువారం ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 13 వారాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌ను దండం పెడుతూ తమ గళం వినిపించారు. జిల్లావ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలు “చెల్లింపులు లేకపోతే ఎలా బ్రతకాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పనిచేసిన పనులకు సరైన రుసుము లేక, రోజువారీ అవసరాలు తీరడం లేదని పేర్కొన్నారు. శాఖ బకాయిలు చెల్లించకపోతే న్యాయంగా కేసులు పెట్టే అధికారం ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం ముందస్తుగా చెల్లింపులు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూలీలకు కేవలం రూ.7 మాత్రమే పెంచడం తగదన్నారు. మండు వేసవిలో కనీసం టెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో ఇచ్చిన సమ్మర్ ఎలవెన్సులు, మంచినీటి వసతులు పూర్తిగా తొలగించడంతో వారి స్థితి మరింత దారుణమైంది అని వాపోయారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ కూలీల కష్టానికి గౌరవం లేకపోవడం బాధాకరమన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఉపాధి పనుల్లో ముందు వరుసలో ఉందని ప్రకటించారంటే, బిల్లుల చెల్లింపులోనూ అదే స్థానం దక్కాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించని ప్రభుత్వంపై ఎందుకు కేసు వేయకూడదో సమాధానం చెప్పాలని వారు కోరారు.