కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత్ పటేల్ ఆదేశాలతో, ఆదోని డీఎస్పీ హేమలత పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీరాములు ఆధ్వర్యంలో అంతర్జాతీయ డీజిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. డీజిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఆధారాల ఆధారంగా కేసును దర్యాప్తు చేసి, కీలక సమాచారం వెలికితీశారు.
మీడియా సమావేశంలో ఆదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ, వన్ టౌన్ పరిధిలో లారీల్లో నుంచి డీజిల్ దొంగతనాలు జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా 12 మంది ముఠా సభ్యులు కనుగొనబడ్డారు. వారిలో 10 మంది డీజిల్ దొంగలుగా, ఒకరు కొనుగోలుదారుగా ఉన్నారు.
డీజిల్ తీసుకుని నగదు చెల్లించే వ్యక్తి సహా మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుండి నాలుగు కార్లు, రూ.10,30,140 నగదు, డీజిల్ తరలించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.
ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. ప్రజల సహకారంతో వీరి అక్రమ కార్యకలాపాలను తిప్పికొట్టగలిగామని డీఎస్పీ హేమలత స్పష్టం చేశారు. ఇదే సమయంలో వాణిజ్య వాహనాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.