చెన్నైకి చెందిన ప్రముఖ టెక్కీ, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ తనపై భార్య తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు అక్రమంగా వేధిస్తున్నారని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన స్నేహితుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, తన వెకేషన్ హోమ్‌పై దాడి చేసి సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
తన భార్య దివ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పదే పదే సమన్లు జారీ చేస్తూ, బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రసన్న శంకర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, తన స్నేహితుడిని వదిలించాలంటే ఓ ఏసీపీ, ఎస్‌ఐ రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆయనకు రక్షణ కల్పిస్తూ, ఇకపై వేధించొద్దని పోలీసులకు సూచించింది. శంకర్ 2012లో దివ్యను వివాహం చేసుకోగా, 2016లో వీరికి కుమారుడు జన్మించాడు. భార్య మానసిక వేధింపులు, వివాహేతర సంబంధం కారణంగా వివాహ బంధం దెబ్బతిందని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు శంకర్ వెల్లడించారు.
తనపై తప్పుడు కేసుల ద్వారా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన శంకర్, పోలీసుల అక్రమ చర్యలను విచారణకు తీసుకోవాలని హైకోర్టును కోరారు. కోర్టు ఆదేశాల తర్వాత కేసు తదుపరి దశ ఎలా ఉండబోతోందో ఆసక్తిగా మారింది.