పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి లండన్‌కు చేరుకున్న ఆమె సోమవారం ఉదయం హైడ్ పార్క్‌లో జాగింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తెల్ల చీర, వైట్ స్లిప్పర్స్‌లో మమతా జాగింగ్ చేస్తూ కనిపించగా, భద్రతా సిబ్బంది ఆమె వెంట నడిచారు. ఈ దృశ్యాలను తృణమూల్ కాంగ్రెస్ నేత కూనాల్ ఘోష్ తన ఎక్స్ అకౌంట్‌లో పంచుకున్నారు.
బ్రిటన్-బెంగాల్ బంధాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యమని మమతా తెలిపారు. సోమవారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు లండన్ వాతావరణానికి అలవాటు పడేందుకు హైడ్ పార్క్‌లో విహరించినట్లు ఆమె వెల్లడించారు. లండన్ కూడా కోల్‌కతాలానే చరిత్ర, ఆధునికత మేళవించిన నగరమని మమతా వ్యాఖ్యానించారు.
ఈ పర్యటనలో బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పలు వ్యాపారవేత్తలు, భారతీయ సంఘాల నేతలతో మమతా భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమం చేయడం ప్రధాన లక్ష్యంగా ఆమె ఈ పర్యటన చేపట్టారు.
బెంగాల్ అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను బలోపేతం చేసేందుకు మమతా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ పర్యటనకు సంబంధించి ఆమె ఇంకా పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.