విశాఖపట్నంలో అంతర్జాతీయ నాటక దినోత్సవాల సందర్భంగా “లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు-2025” మూడు రోజుల పాటు కళాభారతిలో జరగనున్నాయి. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటకాల పోస్టర్లను ఆవిష్కరించారు.
మార్చి 27న గుజరాత్ రచయిత అర్పిల్ దాగత్ దర్శకత్వంలో “ఐటెం” నాటకం, మార్చి 28న అరుణాచల్ ప్రదేశ్ రికెన్ న్జోముల్ దర్శకత్వంలో “ద సేల్ ఆఫ్ లైఫ్”, మార్చి 29న కేరళ దర్శకుడు హిస్నం టోంబో రూపొందించిన “ద టైగర్ మ్యాన్” ప్రదర్శితమవుతాయి. ఓడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నాటక ప్రదర్శనలకు ఉచిత పాస్‌లు అందుబాటులో ఉన్నాయని, నాంచారయ్య (9849414758), మేడ మస్తాన్ రెడ్డి (9676040165), ఫణి స్వామి (8639445706) నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. తెలుగు నాటకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని, గతంలో పాకుడు రాళ్లు, పలికే బంగారమాయే, డొక్క సీతమ్మ వంటి నాటకాలు ప్రదర్శించామని చెప్పారు.
ఈ ఉత్సవాల ద్వారా తెలుగు నాటకరంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ కళాకారులు, రచయితలు, దర్శకులు, నటుల తో రైటర్స్ అకాడమీ ఈ తరహా కళా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ వేమలి త్రినాధరావు, నటుడు చలసాని కృష్ణ ప్రసాద్, రచయిత రాధా రాణి, నవరస మూర్తి, విండీస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.