ఆక్వా రైతులు అధిక విద్యుత్ బిల్లులు, చెరువుల మేత ధరల పెంపు కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా కరెంటు విధానంలో రైతులకు మేలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆక్వా వ్యవసాయం ద్వారా వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చెరువుల మేత ధరలను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఆందోళనలో భాగంగా కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం వద్ద నుండి మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరిన రైతులు, కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వివరించారు.
ఈ కార్యక్రమంలో దెందుకూరు సత్తిబాబు రాజు, నాని రాజు, చవటపల్లి నాగభూషణం, గుమ్మళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్పందన కోసం రైతులంతా సమిష్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.