కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ అంశంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇప్పటి వరకు డీలిమిటేషన్‌కు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని చెప్పారు. ఈ అంశంలో అవసరమైతే తాను దక్షిణాది హక్కుల కోసం పోరాడతానని, కానీ ముందస్తుగా అనవసరమైన భయాలు కలిగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకూడదని తాను కూడా కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. అయితే ఎన్డీయే కూటమిలో భాగమైన తనకు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అనుమానం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను సమర్థమైన ప్రాతిపదికపై చేస్తుందని, దక్షిణాది ప్రయోజనాలను కాపాడటానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై మాట్లాడుతూ ప్రజలపై ఎవరూ భాషను రుద్దలేరని, తాను ఎప్పుడూ దీనికి వ్యతిరేకంగా ఉంటానని తెలిపారు. తన వైఖరిని ఎప్పుడూ మార్చలేదని, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కాపాడేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతానని పవన్ కల్యాణ్ అన్నారు.