మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రోఛ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. వేదపండితులు స్వామివారికి విష్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మధుపర్క నివేదన, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రివర్యులు నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకొని ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దితో సందడిగా మారింది. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ మహోత్సవంలో వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఆలయ ప్రాంగణంలో మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నాదం భక్తి వాతావరణాన్ని మరింత విశిష్టంగా మార్చాయి. మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరిన్ని ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.