మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో బీసీ, కాపు, మైనారిటీ తదితర కులాల్లోని పేద మహిళలకు మూడు నెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి, 75% హాజరు నమోదైన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తారని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ నెల 31లోపు సంబంధిత సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన వారందరికీ ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, శిక్షణ అందించనున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని ఈశ్వరుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు, కీర్తి సుభాష్, సాధనాల లక్ష్మిబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధిని పొందాలని నాయకులు కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేద మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని వారు పేర్కొన్నారు.