శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని అటవీప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 పిడిలేని గొడ్డళ్లు, రవాణాకు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక ఆదేశాలతో, ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది.
డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో, ఆర్‌ఐ సాయి గిరిధర్, ఆర్‌ఎస్‌ఐ వినోద్ కుమార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీమ్ శ్రీకాళహస్తి ఏర్పేడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. స్థానిక అటవీ అధికారులు ఎఫ్‌ఆర్‌ఓ పీ. లోకేష్, ఎఫ్‌బీఓ కె. పురుషోత్తం, కె. రెడ్డప్పల సహాయంతో పాపానాయుడు పేట బత్తినయ్య కాలనీ వైపు వెళ్లగా అనుమానాస్పదంగా ఒక వాహనం కనిపించింది.
పోలీసులను గమనించిన వాహనంలోని వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ, వారిని వెంటాడి పట్టుకున్నారు. అరెస్టు చేసిన వారిలో 8 మంది తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించగా, కారు డ్రైవర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడిగా నిర్ధారించారు. వీరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తిరుపతి స్టేషన్‌కు తరలించారు.
ఎస్‌ఐ రఫీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం ద్వారా అటవీ ప్రాంతంలో జరగుతున్న అనుమానాస్పద చొరబాట్లను ఎదుర్కొనే విధంగా టాస్క్ ఫోర్స్ మరింత గట్టి చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.