ఏలూరులో సీఆర్ఆర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, మహిళల అభివృద్ధి, భద్రత ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని వెల్లడించారు. మహిళలు అత్యవసర సమయంలో 181 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదు. ఏపీలో కోటి మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయనున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం” అని వెల్లడించారు.
మహిళా సాధికారతకు డ్వాక్రా సమూహాలు కీలక భూమిక వహిస్తున్నాయని, వారికి ప్రభుత్వ సహాయాన్ని పెంచేందుకు నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిలో మహిళల పాత్రను పెంచేందుకు ప్రత్యేకంగా పథకాలు అమలు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మహిళలు స్వయం సంపన్నులుగా మారేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తొలుత రూ.131.82 కోట్ల చెక్కును డ్వాక్రా సంఘాల మహిళలకు మంత్రి అందజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, వారి ఉత్పత్తులను అభినందించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.