అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె.ఎల్లవరం పంచాయతీ పరిధిలోని డొంకాడ PVTG కొందు గిరిజన గ్రామం రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 29 కుటుంబాలు, 180 మంది జనాభా జీవిస్తున్న ఈ గ్రామానికి కనీస వసతులు లేవు. గతంలో ప్రభుత్వం రూ. 1.35 కోట్లు మంజూరు చేసినా, ఫారెస్ట్ అనుమతుల లేమితో పనులు ఆగిపోయాయి. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు అయినా ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదు.
జనవరి 22న, సమస్యను అధికారులకు తెలియజేసేందుకు గిరిజనులు డోలు యాత్ర నిర్వహించారు. అడ్డాకులు నెత్తిపై పెట్టుకొని వినూత్న నిరసన చేశారు. ఆ సమయంలో కలెక్టర్ స్పందించి ఫారెస్ట్ అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే, పనులు ప్రారంభించడానికి ఎన్నికల కోడ్ ఆటంకమని అధికారులు పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఆదివాసీ గ్రామంలో కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడం బాధాకరం.
రోడ్డు లేమితో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ముగ్గురు గర్భిణీలు మార్గ మధ్యలోనే డోలీల్లోనే ప్రసవించారు. స్కూల్ పిల్లలు కూడా ప్రతి రోజు 6 కిలోమీటర్లు నడిచి చదువుకోవాల్సిన పరిస్థితి. ఉపాధి హామీ పథకం కింద 16 మందికి జాబ్ కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నాన్ షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించి సదుపాయాలు కల్పించాలి.
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపడతామని గిరిజనులు హెచ్చరించారు. డోలీలతో రోడ్డు వరకు యాత్ర నిర్వహించి, తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. తాంబలి అప్పారావు, తాంబలి సత్తిబాబు, మర్రి పోతురాజు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.