మహా కుంభమేళా సందర్భంగా పూజా కార్యక్రమాల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏర్పాట్లలో లోపం ఉన్నా క్షమించమని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన కుంభమేళా మహాశివరాత్రి రోజున ముగిసింది.
సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో 66 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించారు. వివిధ ప్రాంతాల నుండి, విదేశాల నుండి వచ్చిన భక్తుల తరలివచ్చి మేళా వైభవాన్ని మరింత పెంచారు. భారతీయుల ఐక్యతకు కుంభమేళా గొప్ప నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
కుంభమేళా విజయవంతంగా పూర్తవడం సులభమైన పని కాదని, అన్ని సవాళ్లను అధిగమించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సమర్థంగా నిర్వహించిందని ఆయన ప్రశంసించారు. భక్తుల రద్దీ, భద్రత, తాగునీరు, రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, భక్తులకు, ఏర్పాట్లలో సహకరించిన ప్రతిఒక్కరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత వైభవంగా, మరింత సౌకర్యాలతో కుంభమేళా జరగాలని ఆకాంక్షించారు.