పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి పూట క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రహదారి మధ్యలో పసుపు, బొగ్గులు, నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు ఉంచి, క్షుద్రపూజలకు గుర్తులా ఉన్న ముగ్గులు వేయడం స్థానికుల్లో అనేక అనుమానాలు రేకెత్తించింది.
ఈ ఘటన నగరపంచాయితీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. శివాలయం వద్ద లింగోద్భవం కార్యక్రమం ముగించుకుని వస్తున్న మహిళలు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో ఏదో జరుగుతుందనే అనుమానం వీధివాసులను కలవరపెడుతోంది.
ఇది ఆకతాయిల పనా? లేక వాస్తవంగానే ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారా? అనే విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ గెద్ద వీధిలో ఇదే తరహా ఘటన జరగడం, మళ్లీ ఇక్కడ అలాంటి దృశ్యాలు కనిపించడం ప్రజల్లో భయాన్ని పెంచింది. ఇది కేవలం తాంత్రిక క్రియలమా లేక ఇంకేదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సंबంధిత అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.