మహాశివరాత్రి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, సమీప శివాలయాలను సందర్శించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓంకార నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు “హర హర మహాదేవ” అంటూ స్వామివారి ప్రదక్షిణలు చేసి భక్తిభావంతో నిమగ్నమయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సజావుగా కొనసాగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు.