మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలు విశ్వాసంతో ఆచరిస్తున్నారని, శంకరుడు వారందరికి ఆరోగ్యానందాలు కలిగించాలని కోరుకుంటున్నానని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక మహాశివరాత్రి వేడుకలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు తెల్లవారుజామునే ఆలయాలను సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, శిఖర దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాల్లో భజనలు, ప్రవచనాలు, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించుకుంటూ రాత్రి పూట శివుని భజనల్లో మునిగితేలుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటున్న భక్తులకు శివుని కృప ఎప్పుడూ ఉండాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.