వైసీపీ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. గత ఏడాది డిసెంబర్ 31న చెత్త పన్నును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పన్నును పూర్తిగా తొలగించారు. స్థానిక సంస్థల ద్వారా వసూలు చేసే ఈ పన్ను రద్దుతో ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది.
చెత్త పన్నును వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి నేతలు ఈ పన్నును ప్రజా వ్యతిరేకంగా విమర్శిస్తూ, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పన్ను రద్దుతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రజలకు ఉపశమనం కలిగింది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ చర్య కీలకంగా మారింది. మున్సిపల్ నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిధుల సమీకరణ కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
చెత్త పన్ను రద్దు నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం మొదటి ముందడుగు వేసిందని అంటున్నారు. మున్సిపల్ చట్ట సవరణ అనంతరం గెజిట్ విడుదల కావడంతో ఇకపై ఏపీలో చెత్త పన్ను అమలులో ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
