తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దౌర్జన్యం చేయడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. భక్తులు, ఉద్యోగుల సమక్షంలోనే టిటిడి ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అతడిపై దౌర్జన్యానికి పాల్పడటం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. భక్తుల దేవాలయాన్ని వ్యక్తిగత సంపత్తిగా భావించి, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యోగులను అవమానించడం తగదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేష్ కుమార్‌ను టిటిడి బోర్డు సభ్యత్వం నుంచి వెంటనే తొలగించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఈ బోర్డు సభ్యుడి వ్యవహారశైలి దేవస్థానానికి మాయని మచ్చగా మారిందని, ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు కార్మిక సంఘాలు చేపట్టే పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతు తెలిపింది.
భక్తి స్థలమైన తిరుమలలోనే ఇలాంటి సంఘటనలు జరగడం భక్త లోకాన్ని కుదిపేస్తోంది. సాధారణ భక్తులు అసహనానికి గురైతే అధికారులు సమస్య పరిష్కరించాలి. కానీ టిటిడి బోర్డు సభ్యులే పవిత్రతను మరిచి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే భక్తుల విశ్వాసానికి దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇకపోతే, అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ ఎక్స్పో జరుగుతుండగా, ముఖ్యమైన మంత్రులు తిరుపతిలోనే ఉండడం గమనార్హం. అయినా ఇంతటి ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ప్రభుత్వ తీరుపై భక్తులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.