కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామం దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఈ పవిత్ర స్థలానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది.
గత ఏడాది ఆలయాన్ని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం ఆలయం వరకు ఆటో సౌకర్యాన్ని కల్పించారు. భక్తులు వాహనాలను పార్కు చేయడానికి రెండు కిలోమీటర్ల దూరంలో స్టాండ్ ఏర్పాటు చేశారు.
భక్తుల భద్రతకు పోలీస్ శాఖ గట్టి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా పోలీసులు భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.
ఆలయ అర్చకులు వేదపండితులు, కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, నర్సింలు స్వామి, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, నరేందర్ గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు అందించాలంటూ విజ్ఞప్తి చేశారు.