కోవూరు పట్టణంలోని కొత్తూరు రోడ్ లో గల 80 ఏళ్ల చరిత్ర కలిగిన సన్నపురెడ్డి శేషారెడ్డి ఆయుర్వేద వైద్యశాల పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన కోవూరు నియోజకవర్గ కెర్టేకర్ చప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఆయుర్వేద కేంద్రాన్ని పరిశీలించారు. ఆయుర్వేద డాక్టర్ గంగాధర్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యపై మాట్లాడారు.
శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది దాతల సహాయంతో ప్రారంభమైన ఈ ఆయుర్వేద కేంద్రం ఇప్పుడు వినియోగం లేక శిథిలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మళ్లీ ఈ సేవలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని పునరుద్ధరించాలని అన్నారు. గతంలో ఎన్నో అర్జీలు పంపినా ఎటువంటి స్పందన రాలేదని, అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సహకారంతో దీనిని తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారంతో ఈ కేంద్రాన్ని 20 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ఆయుర్వేద వైద్యం ఎంతో మందికి మేలు చేస్తుందని, ఇది కోవూరు ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి, ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ గంగాధర్, జనసేన మండలాధ్యక్షుడు అల్తాఫ్, కోవూరు మండల జనసైనికులు పాల్గొన్నారు. జనసేన నేతల ఈ ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ఆయుర్వేద వైద్యం ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు త్వరలోనే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించనున్నారు.