భార్య వేరొకరిని ప్రేమించడం అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. శారీరకంగా కలిసినప్పుడే అది అక్రమ సంబంధంగా పరిగణించాలంటూ జస్టిస్ జీ.ఎస్. అహ్లువాలియా వ్యాఖ్యానించారు.
తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని, అందువల్ల ఆమె భరణం పొందే హక్కు లేదని భర్త కోర్టులో వాదించాడు. అయితే, ఈ వాదనను హైకోర్టు ఖండించింది. కేవలం ప్రేమ సంబంధం ఆధారంగా భరణం హక్కును తొలగించలేమని స్పష్టం చేసింది.
ఫ్యామిలీ కోర్టు ఇప్పటికే భర్త నెలకు ₹4,000 మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భార్య భర్త మధ్య శారీరక సంబంధం లేకుంటే, ఆమె వేరొకరిని ప్రేమించడం అక్రమ సంబంధంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది.
ఈ తీర్పుతో భరణంపై చట్టపరమైన స్పష్టత లభించిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం భావోద్వేగ సంబంధాల ఆధారంగా భార్య హక్కులను దూరం చేయలేమని కోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసింది.