కుప్పం అభివృద్ధికి సంబంధించిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ సభ్యుడు ఎం. మంజునాథ్ ఆయనను కలిశారు. ముఖ్యంగా కుప్పంలో కాపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంజునాథ్ కోరారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ భవనం నిర్మాణం పూర్తయితే, అక్కడ అనేక సామాజిక, విద్యా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, కుప్పంలో చిరు వ్యాపారస్తుల సమస్యలు కూడా ముఖ్యమని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన అరటిపండు వ్యాపారస్తుడు వేలు క్యాన్సర్ బారినపడటంతో అతనికి చికిత్స కోసం ఆసుపత్రుల్లో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు. ఆ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాసేవకు కట్టుబడి ఉన్న నేత అని, కుప్పం అభివృద్ధికి ఎప్పుడూ శ్రమిస్తున్నారని మంజునాథ్ కొనియాడారు. చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వం మరింత సహాయం చేయాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ క్రమంలో కుప్పం పట్టణ అభివృద్ధికి సంబంధించి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
కుప్పం ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యమని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంజునాథ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని ముందుండి నడిపిస్తారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు.