విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోని క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రత దెబ్బతింటోందని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల సమావేశాలు, వాణిజ్య ప్రకటనల బోర్డులు పవిత్ర స్థలానికి హాని కలిగిస్తున్నాయని కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ వి. శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.
గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ, రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ ఫ్రెంచ్ పాలనలో నిర్మించబడిందని వివరించారు. “మోర్స్ జానువా విటే” అనే లాటిన్ పదబంధం “మరణం, జీవితం లో ప్రవేశ ద్వారం” అనే అర్థాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఈ స్మశాన వాటికను గతంలో కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలోని క్రిస్టియన్ సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ స్థలాన్ని వాడుకలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మైనారిటీ కౌన్సిల్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సామ్ ఆనంద్ రావ్, మోసెస్ గారియా, రెవరెండ్ హనీ జాన్సన్, విజయ్ దాస్, ఎం. జాన్ ప్రకాష్, జి.ఎస్. ప్రశాంత్ కుమార్, ఎం. ప్రేమ్ కుమార్, బ్రదర్ సిహెచ్. కుమార్ ప్రకాష్, ఎస్. శాంటో తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.