రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను ప్రకటించింది. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ కొత్త నాయకత్వంతో బరిలోకి దిగనుంది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఈసారి వేలంలో వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశముందని ఊహాగానాలు వచ్చాయి.
కానీ, కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తి చూపకపోవడంతో మేనేజ్‌మెంట్ రజత్ పటీదార్‌ను ఎంపిక చేసింది. కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ, జట్టు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రజత్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారు. యువ ఆటగాడిగా ఉన్నప్పటికీ, అతని ఆటతీరును విశ్లేషించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆర్‌సీబీ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ప్రతిసారీ భారీ అంచనాల మధ్య టోర్నీలో బరిలోకి దిగినా, జట్టు గెలుపును అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ రజత్ నాయకత్వంలో ఆర్‌సీబీ జట్టును తిరిగి గెలుపుబాట పట్టించాలని భావిస్తోంది.
ఇక 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటూ, జట్టు కూర్పును మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్యాన్స్ ఈసారి అయినా తమ జట్టు ట్రోఫీని అందుకుంటుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.