గాజువాక తుంగ్లాంలోని తారకరామ కళ్యాణ మండపం పునఃనిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఈ కట్టడం దివంగత ఎం.వి.వి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో 1995లో నిర్మించబడింది. అయితే, కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరింది. జీవీఎంసీ గతేడాది టెండర్ పిలిచినా, నిర్మాణ పనులు ఆలస్యం కావడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
పునఃనిర్మాణ పనులు కొద్దికాలం కొనసాగిన తర్వాత అధికారుల ఆదేశాలతో నిలిపివేయబడ్డాయి. భవన నిర్మాణ స్థలంలో చెరువు ఉందనే కారణాన్ని చూపి జీవీఎంసీ అధికారులు పనులను అడ్డుకున్నారు. అయితే, భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు అన్ని ఉన్నప్పటికీ పనులు ఆపడం సమంజసం కాదని బి.వి.రామ్ విమర్శించారు.
గాజువాక నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ, ఇక్కడే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఆక్షేపనీయమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు కళ్యాణ మండప పునఃనిర్మాణం త్వరగా పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని రామ్ సూచించారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజలు, మహిళలు, తెలుగు శక్తి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.