నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లిలో వారిజాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తిరుకళ్యాణంలో స్వయంగా స్వామివారి పల్లకి మోసి భక్తుల కోలాహలంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటనలు చేశారు. చెరువుగట్టు ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే వారిజాల వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఆలయ కమిటీ ఛైర్మన్ మోహన్ రెడ్డి పాత్రను ప్రశంసించారు.
కృష్ణమ్మను వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుస్తామని, బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా వచ్చే వారం పదిరోజుల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మే నాటికి లక్ష ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్.ఎల్.బీ.సీ సొరంగ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేస్తుందని, కేసీఆర్ పాలనలో పదేళ్లుగా ఆలస్యం అయిన పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన అందించామని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా కృషి చేస్తామని వెల్లడించారు. వేణుగోపాల స్వామి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.