కృష్ణా జిల్లాలో మొబైల్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ద్వారా 310 మొబైళ్లను రికవరీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ నేతృత్వం వహించారు. గుడివాడ సీసీఎస్ 175, పెనమలూరు సీసీఎస్ 83, బందరు సీసీఎస్ 52 మొబైళ్లను రికవరీ చేయగా, మొత్తం 36 లక్షల విలువైన మొబైళ్లను బాధితులకు అందజేశారు.
బాధితులకు వారి మొబైళ్లను తిరిగి అప్పగిస్తూ, ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైళ్లు పోగొట్టుకుంటే వెంటనే 9490617573 నంబర్‌కి “HI” లేదా “HELP” అని మేసేజ్ పంపించి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసులు దర్యాప్తు జరిపి, మొబైళ్లను ట్రాక్ చేసి తిరిగి అందించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని తెలిపారు.
సీసీఎస్ పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొబైల్ దొంగతనాలపై నిఘా ఉంచి, త్వరితగతిన బాధితులకు సహాయం అందిస్తున్నారు. రికవరీ చేసిన ఫోన్లు నేరస్తులను పట్టుకోవడంలో కూడా ఉపయోగపడతాయని తెలిపారు. మొబైల్ రికవరీ తర్వాత బాధితుల ఆనందం వ్యక్తమైంది.
జిల్లా పోలీసులు చూపిన ఈ కృషిని ఎస్పీ గంగాధర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు తమ మొబైళ్ల భద్రత కోసం అప్రమత్తంగా ఉండాలని, చోరీకి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించగలమని పేర్కొన్నారు.