జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడి ముఖ్య అతిధులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి పాత బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణకు ఎంతో అవసరమని పోలీసులు అవగాహన కల్పించారు. ‘అతివేగం – ప్రమాదానికి కారణం’, ‘హెల్మెట్ ధరించండి – జీవితం కాపాడుకోండి’ వంటి ప్లకార్డులు ధరించి పోలీసులు, డ్రైవర్లు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ మురళి డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించి, రహదారి భద్రత నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.
రహదారిపై ప్రయాణించే ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వేసుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. లైసెన్స్ లేని మైనర్లకు వాహనాలు అప్పగించరాదని తెలిపారు.
ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి బ్లాక్ స్పాట్లను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. హెల్మెట్, సీటుబెల్ట్ వంటి చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయని, ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను పాటించాలని సూచించారు.