కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం దేవరాపల్లిలో భారీ నిరసన చేపట్టి, బడ్జెట్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బిటి మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ధరలను, నిరుద్యోగాన్ని పెంచే విధంగా ఉందని, ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. విభజన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్, గిరిజన యూనివర్శిటీ, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, రాజధాని అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధుల కేటాయింపులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గతేడాది కంటే ఈసారి రూ.5,327 కోట్లు తగ్గించారని, ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టుకు సరైన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. పోలవరానికి గతంలో కంటే స్వల్పంగా పెంచినా, పునరావాస సమస్యపై స్పందించకపోవడం అన్యాయమన్నారు. మొత్తం 65 వేల కోట్ల అంచనాలకు 33 వేల కోట్లు తగ్గించడం బాధితులకు తీవ్ర అన్యాయమని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా మోసం చేసిందని ప్రజలకు అర్థమవ్వాలని, దీని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను పట్టించుకోని కేంద్రంపై రాష్ట్ర ప్రజలు తిరగబడాలని సూచించారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేంద్రానికి మద్దతుగా ఉన్నారని, తెలుగు ప్రజల హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.