తరగతి గదిలో విద్యార్ధిని వివాహం చేసుకుంటున్నట్లుగా ఉన్న మహిళా ప్రొఫెసర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో గల అబుల్ కలాం అజాద్ యూనివర్శిటీలో చోటుచేసుకుంది. హిందూ బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహ కర్మలు నిర్వహించినట్లు కనిపించడంతో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
వీడియోలో ప్రొఫెసర్ సంప్రదాయంగా అలంకరించుకుని ఉన్నారు. విద్యార్ధితో కలిసి మంగళసూత్రం ధరించడం, సింధూర్ దాన్ చేయడం, మాలలు మార్చుకోవడం వంటి కర్మలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్సిటీ ఘటనపై విచారణకు ఆదేశించింది. విద్యార్ధి మొదటి సంవత్సరం చదువుతున్నవాడని, ఇలాంటి చర్యలు విద్యాసంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
విచారణలో భాగంగా ప్రొఫెసర్‌ను వివరణ కోరగా, ఇది తమ తరగతిలో నిర్వహించిన సైకో డ్రామా భాగమని తెలిపారు. ఇది అసలు వివాహం కాదని, విద్యార్ధుల కోసం రూపొందించిన వినోదాత్మక ప్రదర్శన మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, వివాదాస్పదమయ్యే అంశాలపై స్పష్టత అవసరమని యూనివర్సిటీ పేర్కొంది.
విచారణ ముగిసే వరకు ప్రొఫెసర్‌ను సెలవుపై వెళ్లాలని, విద్యార్ధిని కూడా కొంతకాలం యూనివర్సిటీకి రాకూడదని అధికారులు నిర్ణయించారు. సోషల్ మీడియాలో ఇది కలకలం రేపడంతో, విద్యాసంస్థల్లో పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణపై కఠిన నియంత్రణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.