రోడ్డు ప్రమాదాలు జరిగితే గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు చాలా మంది వెనుకడతారు. పోలీసు కేసులు, కోర్టుల సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కేవలం అంబులెన్స్‌కు ఫోన్ చేసి తమ బాధ్యత పూర్తయిందని భావిస్తారు. కానీ, సమయానికి వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ‘గుడ్ సమారిటన్ స్కీం’ ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే రూ.25 వేల నగదు బహుమతి అందుతుంది. ప్రారంభంలో ఈ ప్రోత్సాహకాన్ని రూ.5 వేలు గా నిర్ణయించగా, ఇప్పుడు దాన్ని రూ.25 వేలకు పెంచారు. ఒకరి కంటే ఎక్కువ మందిని కాపాడితే రూ.లక్ష వరకు ప్రోత్సాహకం పొందొచ్చు. ముఖ్యంగా, బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ఎలాంటి కేసుల భయం ఉండదని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది.
బహుమతి పొందాలంటే బాధితులను ఆసుపత్రికి తరలించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ఈ కృషిని గుర్తించి అధికారిక లేఖ అందిస్తారు. అనంతరం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆసుపత్రి ధ్రువీకరణ పత్రాలను జతచేసి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. రవాణా, రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖలతో కూడిన కమిటీ సమీక్షించి నగదు బహుమతిని మంజూరు చేస్తుంది.
ఈ పథకం వల్ల బాధితులకు వేగంగా వైద్యం అందే అవకాశం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడమే గొప్ప సహాయమని, ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఆర్థిక బహుమతిని అందిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన పెంచి, ప్రజలు దాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.