అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, ఆమె భర్త విజయభాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ టోర్నమెంట్లో రఘు కైట్స్ జట్టు విజేతగా నిలిచి 30 వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన దినేష్ లెవెన్స్ టీంకు 20 వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, క్రీడలు, విద్యలో రాణించాలని సూచించారు.
మద్యపానం, గంజాయి వంటి చెడు అలవాట్లకు యువత బలికాకూడదని, మంచి లక్ష్యాలతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలయోగి, వెంకటలక్ష్మి, గొల్లపూడి పెద్దిరాజు, సిద్ధు, జయరాం, సీతామహాలక్ష్మి, స్థానిక యువకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో యువత ఉత్సాహంగా సంబరాలు జరిపారు.